న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు బస్సు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో ‘ఒకే దేశం, ఒకే విధానం’ కింద ఉన్న పాత ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (AITP) విధానాన్ని రద్దు చేస్తూ కీలక సవరణలు చేపట్టింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వచ్చాయి.

ఏమిటీ కొత్త నిబంధనలు?
ఇప్పటివరకు ప్రైవేటు ఆపరేటర్లు తక్కువ పన్ను ఉన్న ఇతర రాష్ట్రాల్లో (ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటివి) తమ బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకుని, తెలుగు రాష్ట్రాల్లో నిత్యం సర్వీసులు నడిపేవారు. దీనివల్ల స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా పన్ను ఆదాయం గండి పడటమే కాకుండా, భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ కష్టతరంగా మారింది.
తాజా మార్పుల ప్రకారం:స్థానిక రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ప్రైవేటు బస్సులు ఏ రాష్ట్రంలో తిప్పాలనుకుంటున్నారో, అదే రాష్ట్ర ఆర్‌టీఓ (RTO) కార్యాలయంలోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.60 రోజుల పరిమితి: ఆల్ ఇండియా పర్మిట్ ఉన్న ఏ వాహనమైనా తన సొంత రాష్ట్రం (Home State) వెలుపల వరుసగా 60 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు.
కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలు: బస్సుల కండిషన్, భద్రతా ప్రమాణాల తనిఖీ ఇకపై స్థానిక అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వంటివి నిబంధనల ప్రకారం లేకపోతే కఠిన చర్యలు తప్పవు.ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు:ఇటీవల కాలంలో ప్రైవేటు బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతుండటం, పాతబడిన బస్సులను నడపడం వంటి ఫిర్యాదులు పెరిగాయి.
తాజా నిర్ణయంతో పాత బస్సులకు చెక్ పడనుంది. అలాగే, పన్నులు తప్పించుకోవడానికి సీటింగ్ కెపాసిటీని తప్పుగా చూపించే అక్రమాలకు తావులేకుండా నిబంధనలను కఠినతరం చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలకు పెరగనున్న ఆదాయం:ఈ నిర్ణయం వల్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరనుంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ తిప్పే పద్ధతికి చెక్ పడటంతో, ఆయా రాష్ట్రాల ఖజానాకు నిధులు నేరుగా చేరుతాయి.నిబంధనలు ఉల్లంఘించే ఆపరేటర్లపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, పర్మిట్లను రద్దు చేసే అధికారాన్ని స్థానిక రవాణా శాఖకు కల్పించింది కేంద్రం.