అధికారంలోకి రాగానే నా తొలి సంతకం దానిపైనే.. ‘హైడ్రా’పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Jagityala: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘హైడ్రా’ (HYDRA) పేరుతో పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తూ, ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన అంటే ప్రజలకు అండగా నిలబడాలే తప్ప, రక్తం ధారపోసి కట్టుకున్న కొంపలను నేలమట్టం చేయడం కాదని రేవంత్ సర్కార్‌కు చురకలంటించారు.

నిజామాబాద్‌కు నిడ్రా.. జగిత్యాలకు జిడ్రా తెస్తరా? టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఇవాళ హైదరాబాద్‌లో ‘హైడ్రా’ అంటున్నారు.. రేపు నిజామాబాద్‌కు ‘నిడ్రా’, ఎల్లుండి జగిత్యాలకు ‘జిడ్రా’ తీసుకొస్తారా?” అంటూ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసి.. కేవలం కూల్చివేతలు, విధ్వంసమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు.
తొలి సంతకం హైడ్రా రద్దుపైనే.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ విధ్వంసాన్ని ఇలాగే కొనసాగనివ్వబోమని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. “భవిష్యత్తులో మన పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే, నేను చేసే మొట్టమొదటి సంతకం ఈ దరిద్రపు ‘హైడ్రా’ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసే దస్త్రం పైనే ఉంటుంది” అని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం, వారి పొట్టగొట్టేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
