తాజా వార్తలు

రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె!

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏప్రిల్ 22 (బుధవారం) తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుంచే సమ్మె ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె నివారణకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని, కనీసం చర్చలకు కూడా పిలవలేదని ఆయన విమర్శించారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:

  • ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయడం.
  • పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ (PRC) అమలు.
  • పాత బకాయిలు, పీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) నిధుల విడుదల.
  • ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోవడం.

కార్మికులకు భరోసా.. ప్రయాణికులకు ఇబ్బందులు!

“కార్మికులు ఎవరూ భయపడవద్దు, అన్ని సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇది మరో ‘సకల జనుల సమ్మె’లా సాగుతుంది” అని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

మరోవైపు, ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్నీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. దీంతో నిత్యం ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *