తాజా వార్తలు

దమ్ముంటే రా కేసీఆర్.. 2029లో నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్!

హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ముదిరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్ పల్లిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఇటీవల పార్టీ మారిన జీవన్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. అత్యంత ఘాటైన పదజాలంతో కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు.

2029లో ప్రతిపక్ష హోదా కూడా ఉండదు!

కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతూ.. “దమ్ముంటే రా కేసీఆర్.. 2029లో చూసుకుందాం! వచ్చే ఎన్నికల్లో నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తూ, ఆ పాపానికి కేసీఆర్‌ను ఉరివేసినా తప్పులేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జీవన్ రెడ్డిపై ఘాటు విమర్శలు:

కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేవలం పదవి కోసమే పాపాల భైరవుడి పార్టీలోకి వెళ్లావు. దొరల గడీల ముందు చేతులు కట్టుకుని ఊడిగం చేస్తూ, బానిస బతుకు బతకడానికే ఆ పార్టీలోకి పోయినవా?” అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్‌కు నమ్మకద్రోహం చేసిన చరిత్ర ఆయనదని, ఇప్పుడు 40 ఏళ్లుగా అండగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేశారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం:

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని, రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెడతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులనే ఇప్పుడు మళ్ళీ చేస్తోందని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సభలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *